పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
  • 10న కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలకు పిలుపు 

హైదరాబాద్, వెలుగు: వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద 10న ఆందోళనలు చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

‘అచ్చే దిన్’  వస్తాయని చెప్పి, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఫైర్​అయ్యారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం, సామాన్యులపై మాత్రం పన్నుల భారం వేస్తున్నదని తెలిపారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. కలెక్టర్ కార్యాలయాల ఎదుట జరిగే ఆందోళన కార్యక్రమాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.